పశ్చిమబెంగాల్‌లోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సిబ్బంది అరుదైన జాతికి చెందిన పక్షులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను అడ్డుకున్నారు. సదరు పక్షులను దుండగులు బంగ్లాదేశ్‌కు తరలిస్తుండగా.. సమాచారం అందుకున్న బీఎస్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పక్షుల స్మగ్లింగ్ జరగకుండా చూశారు. ఈ క్రమంలో ఆ పక్షులను వారు స్వాధీనం చేసుకుని జూకు తరలించారు.
పశ్చిమబెంగాల్‌లోని హల్దర్ పారా, అంగ్రెయిల్ అటవీ ప్రాంతంలో పక్షుల స్మగ్లింగ్ జరుగుతుందని సమాచారం అందుకున్న బీఎస్ఎఫ్ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే సిబ్బందిని చూసిన స్మగ్లర్లు పక్షులను పంజరంతో సహా అక్కడే వదిలేసి పారిపోయారు. వారిని పట్టుకునేందుకు బీఎస్ఎఫ్ సిబ్బంది యత్నించారు. కానీ దట్టమైన అటవీ ప్రాంతం కావడం వల్ల వారికి నిందితులను పట్టుకోవడం సాధ్యపడలేదు.
కాగా ఆ పంజరంలో కీల్-బిల్డ్ టౌకన్ జాతికి చెందిన రెండు పక్షులు ఉన్నాయి. అవి అత్యంత అరుదైన జాతికి చెందినవి. వాటి విలువ సుమారుగా రూ.14.21 లక్షలు ఉంటుంది. వాటిని బీఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకుని కోల్‌కతాలోని అలిపొరె జూకు తరలించారు. ఇక సదరు పక్షులు ఎక్కువగా దక్షిణ మెక్సికో, కొలంబియా ప్రాంతాల్లో ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వాటికి విపరీతమైన ధర పలుకుతుంది. అవి అంతరించిపోతున్న అరుదైన జాతికి చెందిన పక్షుల జాబితాలో ఉన్నాయి. బెలిజ్ దేశం జాతీయ పక్షిగా ఆ పక్షి ఉంది.