మహారాష్ట్రలో శివసేన పేరు, ఎన్నికల చిహ్నాన్ని సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వం లోని సేనవర్గానికి ఈసీ కేటాయించడం వెనుక భారీ డీల్ కుదిరిందని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వర్గం నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. పార్టీ పేరును, గుర్తును ‘కొనుగోలు చేసేందుకు’ బీజేపీ రూ. 2 వేల కోట్ల డీల్ కుదుర్చుకుందని, గత ఆరు నెలల కాలంగా ఈ లావాదేవీలు నడిచాయని ఆయన చెప్పారు. ఇది ప్రాథమిక ‘ఒప్పందమని’, 100 శాతం నిజమని అన్నారు.
ఈవిషయాన్ని ఆషామాషీగా చెప్పడంలేదని, ఇందుకు తనవద్ద ఆధారాలున్నాయని, వాటిని త్వరలో బయటపెడతానని రౌత్ ఆదివారం తెలిపారు. దేశ చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదని ట్వీట్ చేశారు. పాలక బీజేపీకి సన్నిహితుడైన ఓ బిల్డర్ ఈ సమాచారాన్ని తనకు తెలియజేశారని పేర్కొన్న ఆయన.. ఇదేమంత తక్కువ సొమ్మా అని ప్రశ్నించారు.
‘మా పార్టీ పేరును, ఎన్నికల చిహ్నాన్ని వారు లాక్కున్నారు.. ఇది ఓ బిజినెస్ డీల్.. కేవలం 6 నెలల్లో రెండువేల కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు జరిగాయి.. ఇది నాకు అందిన ప్రథమ సమాచారం’ అని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ. 50 కోట్లు, ఎంపీలకు 100 కోట్లు, మా కౌన్సిలర్ల కొనుగోలుకు రూ. 50 లక్షలనుంచి కోటి రూపాయలవరకు ముడుపులుగా అప్పజెప్పేందుకు సిద్ధంగా ఉంటుందని, అలాంటిది ఏకంగా మా పార్టీ పేరును, చిహ్నాన్ని కొనేందుకు 2 వేలకోట్లు ఖర్చు పెట్టిందంటే ఇక మీరే ఆలోచించుకోవాలని సంజయ్ రౌత్ అన్నారు.
ఈసీ ఉత్తర్వులపై స్పందించిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ‘సత్యమేవ జయతే’ అని వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పు పట్టారు. న్యాయాన్ని, సత్యాన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చునని అంటున్న వ్యక్తుల మాటలను ఎవరు వింటారని రౌత్ అపహాస్యం చేశారు. సమయం వచ్చినప్పుడు రాష్ట్రంలో తమదే ఎలా పైచేయి అవుతుందో నిరూపిస్తామన్నారు.