కారు కొన్నదేమో 11లక్షలకి..అదేమో ఇంటి ముందు పార్క్ చేసుకుంటే వరదలు వచ్చి పూర్తిగా పాడైపోయింది. దాన్ని రిపేర్ చేయించుకోవడం కోసం సర్వీస్ సెంటర్ కు తీసుకుని వెళ్తే … వారు రిపేర్ బిల్లు ఏకంగా 22 లక్షలు అవుతుందని చెప్పారు. అంతే యజమాని గుండె ఒక్కసారిగా జారిపోయింది.
ఈ చేదు అనుభవం బెంగళూరుకు చెందిన అనిరుధ్ గణేశ్ కు ఎదురైంది. ఆయన అమెజాన్ లో ప్రోడక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల బెంగళూరు నగరాన్ని వరదలు వణికించాయి. అనిరుధ్ కు చెందిన వోక్స్ వ్యాగన్ పోలో కారు.. ఆ వరదల్లోనే నడుము లోతు నీటిలో మునిగిపోయింది. దీంతో ఇంజన్ సహా కారులోని ముఖ్య భాగాలన్నీ దెబ్బతిన్నాయి.
కారు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అనిరుధ్ ఒక ట్రక్కును పిలిపించి కారును అందులోకి ఎక్కించి.. బెంగళూరు నగరంలోని వైట్ ఫీల్డ్ లో ఉన్న వోక్స్ వ్యాగన్ యాపిల్ ఆటో సర్వీస్ సెంటర్ లో దింపారు.
అప్పటికే ఇలా మరమ్మతుకు గురైన ఎన్నో కార్లు సర్వీస్ సెంటర్ లో ఉన్నాయి. దీంతో 20 రోజుల తర్వాత సర్వీస్ సెంటర్ నుంచి అనిరుధ్ కు ఫోన్ కాల్ వచ్చింది.
మీ కారు రిపేర్ కు రూ.22 లక్షలు అవుతుందని సర్వీస్ సెంటర్ ప్రతినిధులు చెప్పారు. ఆ మాట విని అనిరుధ్ గుండె గుభేల్ మంది.దీంతో అతడు వెంటనే తాను కారుకు ఇన్సూరెన్స్ చేయించిన ‘అకో’ కంపెనీని సంప్రదించాడు. వరదల్లో కారు మునిగిపోయి దెబ్బతిన్న తీరును బీమా కంపెనీ ప్రతినిధులకు వివరించాడు. కారు రిపేరింగ్ ఖర్చు రూ.22 లక్షలవుతుందని సర్వీస్ సెంటర్ ప్రతినిధులు చెప్పారన్నాడు.
ఇది విన్న అకో కంపెనీ ప్రతినిధులు.. కారు రేటుకు మించి సర్వీస్ చార్జీ అయ్యేంత భారీ స్థాయిలో మరమ్మతులు చేయించాల్సి వస్తే దానికి కారు ధరకు సరిపడా బీమా పరిహారం పొందే అర్హత ఉంటుందన్నారు. దీంతో సంతోషంగా కారు సర్వీసింగ్ సెంటర్ కు వెళ్లిన అనిరుధ్ కు మరో షాక్ ఎదురైంది.
రూ.22 లక్షల ఎస్టిమేషన్ బిల్లును ఇవ్వాలంటే రూ.44,840 కట్టాలని సర్వీస్ సెంటర్ ప్రతినిధులు చెప్పారు. దీనిపై వెంటనే వోక్స్ వ్యాగన్ కస్టమర్ కేర్ కు అనిరుధ్ ఫిర్యాదు చేశారు. అనంతరం కస్టమర్ కేర్ ప్రతినిధి నుంచి ఆయనకు ఒక కాల్ వచ్చింది. కారుకు పూర్తి స్థాయిలో (ధరకు సమానంగా) నష్టం జరిగిన సందర్భాల్లో మరమ్మతు ఖర్చులను అంచనా వేయడానికి కేవలం రూ.5వేలు చెల్లిస్తే సరిపోతుందని అనిరుధ్ కు తెలిపారు.
దీంతో ఊపిరి పీల్చుకున్న అనిరుధ్ రూ.5వేలు కట్టి సర్వీస్ సెంటర్ ఇచ్చిన రిపేరింగ్ ఎస్టిమేషన్ ను తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర క్లెయిమ్ చేసుకున్నాడు.