చెన్నైలో భారీగా హవాలా మనీ పట్టుబడింది. ఒంగోలు నుంచి చెన్నైకు తరలిస్తున్న హవాలా సొమ్మును చెన్నై పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో.. తనిఖీలు చెపట్టిన పోలీసులకు భారీగా రూ. లక్షల్లో హవాలా సొమ్ము బయటపడటంతో పోలీసు షాక్ అయ్యారు.
చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ లో ఆంధ్రా నుంచి వచ్చిన ఓ యువకుడు అనుమానస్పదంగా కనిపించాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని ఆపి చెక్ చేశారు. అతని షర్ట్ లోపల సుమారు రూ.30 లక్షలు, బ్యాగ్ లో మరో రూ.30 లక్షలు బయటపడ్డట్టు రైల్వే పోలీసులు వెల్లడించారు.
వాటికి సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అతను రాజమండ్రి నుంచి చెన్నై సెంట్రల్ కు వెళ్తున్నాడని.. కానీ విజయవాడ నుంచి చెన్నైకి టికెట్ తీసుకున్నాడని పేర్కొన్నారు పోలీసులు.
అక్రమ మనీ తరలింపుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితున్ని విచారిస్తున్నట్టు పేర్కొన్నారు. భారీ మొత్తాన్ని ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నాడు.. దీని వెనక ఎవరున్నారు అనే కోణంలో విచారిస్తున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే కేసుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు పోలీసు ఉన్నతాధికారులు.