దేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో షియోమీ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఆ కంపెనీ కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా టీవీలు, ఇతర ప్రొడక్ట్స్‌ను కూడా విక్రయిస్తోంది. ఆ ప్రొడక్ట్స్ అన్నింటికీ మార్కెట్‌లో డిమాండ్ ఉంది. అయితే దీన్నే అదనుగా భావించిన కొంత మంది విక్రయదారులు ఎప్పటి నుంచో నకిలీ షియోమీ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. అవును.. షియోమీ కంపెనీయే తాజాగా ఈ విషయాన్నివెల్లడించింది. కొన్ని లక్షల రూపాయల విలువైన నకిలీ షియోమీ ఉత్పత్తులను పోలీసులు ఇటీవలే స్వాధీనం చేసుకున్నారు.
షియోమీ ఫిర్యాదు మేరకు బెంగళూరు, చెన్నై నగరాల్లో అక్టోబర్, నవంబర్ నెలల్లో పోలీసులు పలు మొబైల్ షాపులపై దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో రూ.33.3 లక్షల విలువైన షియోమీ నకిలీ ఉత్పత్తులను వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు షియోమీ వివరాలను వెల్లడించింది. అందువల్ల వినియోగదారులు అలాంటి ఉత్పత్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆ కంపెనీ హెచ్చరిస్తోంది.
షియోమీకి చెందిన మొబైల్ ఫోన్లు, మొబైల్ బ్యాక్ కేసెస్, హెడ్‌ఫోన్స్, పవర్ బ్యాంకులు, చార్జర్లు, ఇయర్ ఫోన్లు.. ఇలా ఒకటేమిటి.. అనేక ఉత్పత్తులను నకిలీల రూపంలో విక్రయిస్తున్నారని ఆ కంపెనీ తెలిపింది. అయితే నిజానికి ఈ దందా ఎప్పటి నుంచో కొనసాగుతుందని భావిస్తున్నారు. కాగా ముంబై, ఢిల్లీల్లోనూ ఇలాగే కొందరు నకిలీ షియోమీ ప్రొడక్ట్స్ ను విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో వినియోగదారులు ఆయా నకిలీ ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
నకిలీలను ఇలా గుర్తించండి…
* షియోమీకి చెందిన కొన్ని ప్రొడక్ట్స్‌పై సెక్యూరిటీ కోడ్స్ ఉంటాయి. అవి లేకపోతే ఆ ప్రొడక్ట్ నకిలీదిగా భావించాలి. ఆ కోడ్ ఉన్నప్పటికీ mi.com అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆ కోడ్‌ను ఎంటర్ చేసి మీరు కొన్న ప్రొడక్ట్ అసలైందేనా, నకిలీదా.. అన్న విషయాన్ని నిర్దారించుకోవాలి.
* ప్రొడక్ట్‌లను ఎంత కాపీ చేసినా ఒరిజినల్ ప్రొడక్ట్‌లంత క్వాలిటీగా అవి ఉండవు. చూస్తేనే నాసిరకంగా అనిపిస్తాయి. అలాగే బాక్స్ ప్యాకింగ్ కూడా భిన్నంగా ఉంటుంది. కావాలంటే ఎంఐ స్టోర్‌లకు వెళ్లి అసలు బాక్స్‌ల ప్యాకింగ్ ఎలా ఉందో నిర్దారించుకోవచ్చు.
* మీరు కొన్న ఎంఐ ప్రొడక్ట్‌పై ఎంఐ లోగో ఉంటుంది. దాన్ని ఎంఐ వెబ్‌సైట్‌ను చూసి వెరిఫై చేసుకోవచ్చు. లోగోను కాపీ చేసినా దాన్ని ఒరిజినల్‌తో పోల్చి చెక్ చేసుకోవచ్చు.
* మీరు కొన్న ఎంఐ బ్యాండ్ అసలుదే అయితే అది ఎంఐ ఫిట్ యాప్‌కు కనెక్ట్ అవుతుంది. అదే నకిలీది అయితే కనెక్ట్ కాదు. ఈ విషయాన్ని ఆ విధంగా నిర్దారించుకోవచ్చు.
* నాసిరకం కేబుల్స్, బ్యాక్ కేసెస్ చాలా సులభంగా పగులుతాయి. వాటిని అలా వెరిఫై చేసుకోవచ్చు.