టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి విశ్వవ్యాప్తంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేశాడు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా. అతని విజయాన్ని దేశమంతా ఇప్పటికీ పండగలా చేసుకుంటోంది. రాష్ట్రపతి మొదలు.. ప్రముఖులంతా అతడు సాధించిన విజయంపై ప్రశంసలు కురిపించారు.అయితే అంత పెద్ద విజయం సాధించడం వెనుక కేంద్రం ప్రోత్సాహంఎంతో ఉందని తాజాగా తెలిసింది.
2012 అండర్ 16 జాతీయ ఛాంపియన్, 2015లో జాతీయ జూనియర్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడంతో.. అతన్ని మరింత రాటుదేల్చాని కేంద్రం భావించింది. అలా నీరజ్ చోప్రాకు తర్పీదు ఇచ్చేందుకు భారీగానే ఖర్చు చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వివరాల మేరకు.. నీరజ్ చోప్రా కోసం మొత్తం రూ. 7 కోట్లకుపైనే ఖర్చు పెట్టింది.
ఇందులో భాగంగా ఒలింపిక్స్ వెళ్లే ముందు 450 రోజుల పాటు నీరజ్ చోప్రాను విదేశాల్లో శిక్షణకు (రూ. 4.85 కోట్లు) పంపింది. అలాగే 1167 రోజుల పాటు పాటియాలలోని నేషనల్ కోచింగ్ క్యాంప్‌లో శిక్షణను ఇచ్చింది. ఈ సమయంలో 177 జావెలిన్లను కొనుగోలు చేసింది. రూ. 74.28 లక్షల ఖర్చుతో జావెలిన్ త్రో మెషిన్‌ను కొనుగోలు చేసింది. రూ. 1.22 కోట్లు చెల్లించి డాక్టర్ క్లాస్ బార్టోనియెట్జ్‌ను నీరజ్‌కు కోచ్‌గా నియమించింది. ఒలింపిక్స్ పాల్గొనే కొద్ది రోజుల ముందు కూడా నీరజ్ 50 రోజుల పాటు స్వీడన్‌లో ఉన్నాడు. అక్కడ యూరప్ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. అందుకోసం రూ.19.22 లక్షలు ఖర్చు చేసింది. నీరజ్ చోప్రా కష్టానికి కేంద్రం సాయం కూడా తోడు కావడం వల్లే… ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలనే భారత్ కల నెరవేరింది.