రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంపీలను అరెస్టు చేయడం లేదా ప్రశ్నించరాదనే అభిప్రాయాలు కొందరిలో ఉన్నాయని అన్నారు.
పార్లమెంట్ సభ్యులు కూడా సాధారణ వ్యక్తుల లాంటి వారే అని ఆయన పేర్కొన్నారు. క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుల్లో ఆ ఎంపీలకు సభ ఎలాంటి రక్షణ కల్పించలేదని ఆయన తెలిపారు.
సభకు హాజరు కావాలనే ఉద్దేశంతో వారికి కేసుల విచారణ నుంచి ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. న్యాయప్రక్రియను, చట్టాన్ని గౌరవించడం సభ్యులు తమ విధిగా భావించాలని ఆయన కోరారు.
ఇటీవల శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు పంపింది. సమావేశాల నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని ఈడీకి ఆయన తెలిపారు. రెండు నోటీసులు పంపినా ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ రౌత్ ఇంటిపై దాడులు నిర్వహించి.. ఆయన్ని అరెస్టు చేసింది.