ఓయూ విద్యార్థి నాయకుడు సురేష్ యాదవ్ ను చంపే కుట్ర జరిగిందా..? టీఆర్ఎస్ నాయకులు పక్కా స్కెచ్ తో అతడ్ని చంపేందుకు చూశారా..? అంటే అవుననే అంటున్నాడు సురేష్ యాదవ్. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్ల పహాడ్ లో జాతర కార్యక్రమానికి వెళ్లాడు సురేష్. అక్కడే తనకు స్పాట్ పెట్టారని చెబుతున్నాడు.
దాదాపు 20మంది టీఆర్ఎస్ గూండాలు తనని చంపేందుకు ప్రయత్నించారని అంటున్నాడు సురేష్. పథకం ప్రకారం తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని.. తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నాడు. దాడిని అడ్డుకున్న తన సోదరుడు మహేష్, గ్రామస్తులను కూడా తీవ్రంగా గాయపరిచారని చెబుతున్నాడు.
ఈ దాడిలో నూతన్‌కల్ ప్రస్తుత పీఏసీఎస్ చైర్మన్ వెంకన్నతో సహా 25 మంది ఉన్నట్టు తెలిపాడు సురేష్. రాడ్లు, బీరు సీసాలతో చుట్టుముట్టి.. దాడి చేశారని చెప్పాడు. టీవీలో బాగా మాట్లాడతావు కదరా.. ఇప్పుడు మాట్లాడు అంటూ కొట్టారని వివరించాడు. వెంకన్న.. ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు ప్రధాన అనుచరుడని.. అంబేద్కర్ విగ్రహం కూలగొట్టారని ప్రశ్నించినందుకే తనను చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించాడు. ప్రశ్నించే వారిని చంపేస్తే.. మళ్లీ ఎవరూ ముందుకు రారని టీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నట్లు చెప్పాడు సురేష్ యాదవ్. ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితి లేదని.. వేరే రాష్ట్రానికి వెళ్లిపోతానని వాపోయాడు. దాడి తర్వాత వెంకన్నను, అతడి వాహనాలను పోలీసులే దగ్గరుండి పంపారని చెప్పుకొచ్చాడు.
విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై కొన్నాళ్లుగా సురేష్ యాదవ్ పోరాటం చేస్తున్నాడు. ప్రతీ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని ఎడగడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడ్ని టీఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేసినట్లుగా భావిస్తున్నారు విద్యార్థి సంఘాలు. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని ఓయూలో దాడి జరిగింది. ఇది బాల్క సుమాన్ అనుచరుల పనేనని అన్నాడు సురేష్. ఈ ఇష్యూ అప్పట్లో సంచలనం అయింది. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, పలు రాజకీయ పార్టీల నాయకులు ఓయూను సందర్శించి సురేష్ ను పరామర్శించారు. ఇప్పుడు మళ్లీ దాడి జరిగింది.