– ఆరా సర్వేపై ప్రతిపక్షాల గరంగరం
– ఫేక్ సర్వే అంటూ ఆగ్రహం
– కేసీఆర్ ను టార్గెట్ చేసిన కాంగ్రెస్, బీఎస్పీ
ఓవైపు ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. జనం వరద నీటితో అల్లాడుతున్నారు. కొన్నిచోట్ల ఇళ్లపైకి చేరి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ సమీక్షలతో కాలం వెల్లదీస్తున్నారని.. ఎలాంటి సహాయ కార్యక్రమాలు జరగడం లేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. సరిగ్గా ఇదే టైమ్ లో ప్రస్తుతం పార్టీల పరిస్థితిపై ఆరా సంస్థ ఇచ్చిన సర్వే.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే.. టీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ గా కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.
వరంగల్ డిక్లరేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ పెరిగిందని రేవంత్ రెడ్డి ఇటీవలే వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ వేగంగా పడిపోతోందని చెప్పారు. ఇదే విషయాన్ని కేసీఆర్ కు ఆరా మస్తాన్ రిపోర్ట్ ఇచ్చాడని రేవంత్ అన్నారు. అయితే.. తాను ప్రస్తుతం టీఆర్ఎస్ కోసం పని చేయడం లేదని.. రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అయితే.. ప్రజా వ్యతిరేకత అధికంగా ఉన్న టీఆర్ఎస్ కు అనుకూలంగా ఈ సర్వే ఇచ్చారని మస్తాన్ పై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. అలాగే.. 6 శాతం ఉన్న బీజేపీని 30 శాతానికి పెరిగిందని చెప్పడం వెనుక కూడా కుట్ర ఉందని ఆరోపిస్తోంది.
ఈ సర్వే నిర్వహించిన మస్తాన్ బీజేపీ నాయకుడని.. అతను ప్రధాని మోదీని కలిశాడని, తెలంగాణ ప్రజలను మోసం చేయడం కోసం బీజేపీ తరఫున తప్పుడు సర్వే ప్రకటించాడని మండిపడుతోంది. తమ సర్వేలు తమకు ఉన్నాయని హస్తం నేతలు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆరా మస్తాన్ గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన వీడియోలను షేర్ చేస్తూ.. బీజేపీతో అతడికి అనుబంధం ఉన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు బీఎస్పీ ప్రధాన మూడు పార్టీలను టార్గెట్ చేసింది. ముఖ్యంగా కేసీఆర్ పై మండిపడ్డారు ఆపార్టీ అధ్యక్షుడు ఆర్ ప్రవీణ్. ఈ సర్వేపై స్పందిస్తూ.. ‘కేసీఆర్ చిల్లర మైండ్ గేమ్స్ చూస్తే నవ్వొస్తుంది. ఆరా మస్తాన్, ఎందరిని ఏం అడిగిండో నాకు తెలవదు కానీ, ఇప్పటికీ 104 రోజులు దాదాపుగా 15000 కిమీ ప్రయాణం, 760 పైగా గ్రామాలు తిరిగి చెప్తున్న, ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా మీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మైండ్ బ్లాక్ అవుడు ఖాయం. మా సవాల్‌కు సిద్ధంగా ఉండండి’ అని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్. ప్రస్తుతానికి పార్టీల మధ్య సర్వే పంచాయితీ నడుస్తోంది. ఇది ఎటు టర్న్ తీసుకుంటుందో చూడాలి.