బీసీసీఐ అధ్యక్ష పదవి వివాదం అంతకంతకూ పెరుగుతోంది. ఇందులోకి రాజకీయ పార్టీలు ఎంట్రీ కావడంతో బీజేపీదే తప్పు అనేలా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. దానికి కారణం.. జై షా సెక్రెటరీగా కొనసాగుతుండడమే. ఎలాంటి క్రికెట్ అనుభవం లేని జై షా కొనసాగగా లేనిది.. గంగూలీ ఎందుకు రెండోసారి అధ్యక్షుడు కాకూడదనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ప్రతిపక్ష నేతలు బీజేపీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
ఈ వివాదంపై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడారు. ‘‘చివరికి భారత క్రికెట్ ను కూడా వదల్లేదు బీజేపీ, అమిత్ షా గ్యాంగులు. ఇటువంటి గజ దొంగల ముఠాల వెంబడి అమాయకంగా తిరుగుతూ తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మా హిందూ సోదరులు. అందుకే మునుగోడులో బీజేపీని ఓడించి మన బీఎస్పీకి పట్టం కడుదాం పదండి’’ అని పిలుపునిచ్చారు. బీజేపీ ఈజ్ చీటింగ్ హిందూస్ హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేశారు ఆర్ఎస్పీ.
సౌరవ్ గంగూలీ 2019 నవంబర్ 19న బీసీసీఐ బాస్ గా నియమితులయ్యారు. రెండోసారి కూడా కొనసాగాలని ఆశించారు. కానీ, ఈమధ్య ఢిల్లీలో జరిగిన బీసీసీఐ ప్రముఖుల సమావేశంలో తానిక పోటీ చేయనని గంగూలీ చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే 1983లో ప్రపంచకప్ సాధించిన భారత జట్టులో సభ్యుడైన రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్ష రేసులోకి వచ్చాడు. పోటీ కోసం నామినేషన్ కూడా దాఖలు చేశాడు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే రోజర్ బిన్నీ బీసీసీఐ తదుపరి బాస్ అవుతారు. అమిత్ షా కుమారుడు జై షా మాత్రం బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగనున్నారు. అరుణ్ ధుమాల్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్(పాలకమండలి) హెడ్ గా ఉండనున్నారు. అభిషేక్ ధాల్మియా(జగ్మోహన్ ధాల్మియా కుమారుడు) ఐపీఎల్ పాలకమండలి సభ్యుడిగా, ఖైరుల్ జమల్ మజుందార్ అపెక్స్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉండనున్నారు.