317 జీవోను సవరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాటం సాగిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించారు. అయితే పోలీసులు ముందస్తుగా ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులను ప్రత్యేకించి ఉపాధ్యాయులను ఉగ్రవాదులుగా చూస్తోందన్నారు ఆర్ఎస్పీ. లేకపోతే.. 317 జీవోకు సవరణలు కావాలని ఇందిరా పార్క్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తామంటే.. రాత్రికి రాత్రే అన్ని జిల్లాల్లో ఉద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం అదుపులోకి తీసుకోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
ఇటు ప్రధాని మోడీ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతల నిరసనలపైనా స్పందించారు ఆర్ఎస్ ప్రవీణ్. మోడీ కామెంట్స్ ను నిరసిస్తూ.. ప్రజలు రోడ్లెక్కాలని కేటీఆర్ పిలుపునివ్వడం నిజంగా హాస్యాస్పదంగా ఉందంటూ చమత్కరించారు.
తెలంగాణ ఏర్పాటుకు కారణమైన రాజ్యాంగాన్నే మార్చాలని కేసీఆర్ పిలుపునిచ్చినపుడు ఎక్కడ దాక్కున్నారని కేటీఆర్ ను ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూటమి దేశంలో మత విద్వేషాలు రగిలిస్తుంటే.. బీసీల జనగణన నిరాకరించినప్పుడు ఎందుకు రోడ్డెక్కలేదని నిలదీశారు ఆర్ఎస్పీ.