మునుగోడు ఉప ఎన్నిక టైమ్ దగ్గర పడుతోంది. రోజులు గడిచే కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ ఎక్కువవుతోంది. ప్రచారం అయితే.. పోటాపోటీగా సాగుతోంది. అయితే.. ధన ప్రవాహం కూడా అదేస్థాయిలో జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా ఓటుకు నోటు కార్యక్రమాన్ని శరవేగంగా నిర్వహిస్తున్నాయని ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.
తాజాగా మునుగోడుకు వెళ్తున్న 16 కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ‘‘మునుగోడే కాదు, మొత్తం దేశాన్నే నాశనం చేసిండ్రు ఈ గజదొంగలు. ఆయిల్ ట్యాంకర్లు, అంబులెన్సులు, మినరల్ వాటర్ పంపిణీ ఆటోలు, పాల ట్యాంకర్లు, ఇసుక లారీలు, ఒక్కో సారి నకిలీ పోలీసు వాహనాలు, ఇంకా ఎన్నో డబ్బుల సరఫరా కోసం వాడతారు. ఇప్పటికే మునుగోడుకు చాలా పైసలు వచ్చాయి’’ అని ట్వీట్ చేశారు.
మరో ట్వీట్ లో ‘‘నిజంగా పోలీసులకు, ఎన్నికల సంఘానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మునుగోడు, దాని చుట్టు పక్కల పట్టణాల్లో తిరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, వాళ్ల ఎస్కార్టు వాహనాలు, ముఖ్యమంత్రి కాన్వాయ్ ని కూడా రెగ్యులర్ గా సోదా చేయాలి. అప్పుడే ఈ ఎన్నికల్లో అక్రమ ధన ప్రవాహం ఆగుతుంది’’ అని తెలిపారు.
మునుగోడు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి హవాలా సొమ్ము భారీగా దొరుకుతోంది. అది మునుగోడు కోసమే తరలిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. అయితే.. అధికార పార్టీ నేతలు తమ వాహనాలు.. బీజేపీ ఇతర వాహనాల్లో గుట్టుచప్పుడు కాకుండా నగదును తరలిస్తున్నాయనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి ఇతర పార్టీలు.