తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యలపై శనివారం ఉదయం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
సీఎం ఫామ్ హౌస్, ప్రగతి భవన్ లను వదిలి బయటకు వస్తే.. రైతుల ఆత్మహత్యలు ఉన్నాయో లేదో తెలిసేదన్నారు. రైతు బంధు పేరుతో వేల కోట్ల రూపాయలను భూస్వాములకు ఇస్తూ ఎకరం భూమి ఉన్నవారికి ప్రభుత్వం ఇచ్చే అరకొర సహాయం కనీసం పెట్టుబడికి కూడా సరిపోవడం లేదన్నారు.
మీ ప్రభుత్వంలో కౌలు రైతుల గురించి మాట్లాడటమే నేరం అయిందని ధ్వజమెత్తారు. కౌలు రైతుల గురించి మాట్లాడితేనే ఉరికించి కొడతామన్నారు కదా అని తీవ్రంగా విమర్శించారు.
కాగా శుక్రవారం ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు సంక్షేమం వర్ధిల్లుతోందని బీఆర్ఎస్ వచ్చాక తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవన్నారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశమంతటా 24 గంటల కరెంట్ సరఫరా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందజేస్తామని తెలిపారు.
సారూ, తమరు ఫామౌస్/ప్రగతి భవన్ వదిలి బయటికొస్తే కదా తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఉన్నాయో, లేదో తెలిసేది! రైతుబంధు పేరిట వేల కోట్ల రూపాయలు భూస్వాములకు ఇస్తే,ఎకరం భూమి ఉన్నోళ్లకు మీరిచ్చే అరకొర పెట్టుబడికి కూడా సరిపోతలేవు. అసలు కౌలు రైతుల గురించి మాట్లాడితేనేమో ఉరికిచ్చి కొడ్తమంటిరి. pic.twitter.com/yS0XZuzQWc
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) January 28, 2023