సీఎం కేసీఆర్ పై బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు కాంట్రాక్టులు, కమీషన్లే తప్ప ప్రజా సమస్యలు, రైతుల కష్టాల గురించి ఏమాత్రమూ పట్టదని విమర్శించారు.
యాసంగి వరి ధాన్యాన్ని కొనేదాక రైతుల పక్షాన బీఆర్ఎస్ సర్కార్ దుర్మార్గాన్ని ప్రజల్లో ఎండగడతామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం రైస్ మిల్లర్లతో కుమ్మక్కయిందని ఆయన ఆరోపణలు గుప్పించారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ఇప్పుడు గిట్టుబాటు ధర లేక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మిల్లర్ల చేతిలో మోసపోయి, దళారులకు చౌకగా పంట అమ్ముకొని నష్టపోతున్నారని చెప్పారు.
సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పే బంగారు తెలంగాణలో రైతులకు చివరకు మిగిలింది ఇదేనా? అంటూ ప్రశ్నించారు. వరి కొనుగోలు కేంద్రాల్లో రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ఐకేపీ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు.