మునుగోడు యుద్ధక్షేత్రంలో అభ్యర్థుల లెక్క పెరుగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. మూడు పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకే ఛాన్స్ ఇచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఈ బైపోల్ సెమీస్ లా భావిస్తుండడంతో ప్రచారంలోనూ జోరు పెంచాయి. ఇదే క్రమంలో బీఎస్పీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది.
మునుగోడు ఉపఎన్నికకు బీఎస్పీ అభ్యర్థిగా ఆందోజు శంకరాచారిని ఎంపిక చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల రాజ్యాధికారమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని అన్నారు. రాష్ట్ర జనాభాలో 50శాతం ఉన్న బీసీలకు 60 నుంచి 70 సీట్లు ఇవ్వాలన్న లక్ష్యంతో మునుగోడు నియోజకవర్గ బై ఎలక్షన్ లో బీసీ అభ్యర్థిని ప్రకటించామని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అగ్రవర్ణాలకు టికెట్లు ఇచ్చాయని.. కేవలం బీఎస్పీ పార్టీనే బీసీలకు అవకాశం కల్పించిందని వివరించారు ఆర్ఎస్పీ. మునుగోడులో 50 శాతం కన్నా ఎక్కువగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఈ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు.
కొద్దిరోజులుగా మునుగోడు నియోజకవర్గంలోనే బహుజన రాజ్యాధికార యాత్ర నిర్వహిస్తున్నా ఆర్ఎస్ ప్రవీణ్. ఉప ఎన్నికలో సత్తా చాటాలని ఓటర్లు ఆకర్షించే పనిలో ఉన్నారు. ఇక శ్రీకాంతాచారి విషయానికి వస్తే… ఈయన నల్గొండ జిల్లా నారాయణపూర్ మండలం, జనగాం గ్రామానికి చెందిన నేత.