రోడ్డు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పచ్చి బాలింత పది కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకున్న హృదయవిదారక ఘటన కొమురం భీం జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. దీనిపై బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
కేటీఆర్.. ఇదేనా బంగారు తెలంగాణ అంటూ ప్రశ్నించారు. మైకు దొరికితే మాటి మాటికి బంగారు తెలంగాణ అనడమే కానీ.. సాధించిందేం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుందని విమర్శించారు.
మీ ఎనిమిదేళ్ల పాలనలో పచ్చి బాలింత 10 కిలోమీటర్లు నడిచిందని చెప్పుకోవడానికి మీకో చరిత్ర మిగిలిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేనా.. మీ బంగారు తెలంగాణ ఇదేనా ఆడబిడ్డల ఆత్మగౌరవం? అంటూ ప్రశ్నించారు.
తెలంగాణ తల్లుల్లారా.. వచ్చే ఎన్నికల్లో ఆ టీఆర్ఎస్ పాలకులను పారద్రోలుదాం.. అంటూ ట్విట్టర్ లో పిలుపునిచ్చారు. అయితే.. బాలింత 10 కిలోమీటర్లు నడుచుకుంటు వెళ్లిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.