వేల సంవత్సరాలుగా బహుజనులు ఎలా అణిచివేతకు గురయ్యారో బహుజనులకు అర్థమైన రోజు బీజేపీ,టీఆర్ఎస్ లాంటి పార్టీలు నామరూపాలు లేకుండా పోతాయని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్‌లను ఓడించే సత్తా బీఎస్పీ పార్టీకి మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇంతకాలం బహుజనులకు వారి చరిత్రను గురించి చెప్పలేదన్నారు. వారికి జరిగిన అన్యాయాన్ని గురించి వివరించలేదన్నారు. కానీ బహుజనులకు వారి చరిత్ర గురించి బోధించి, వారికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, వారి న్యాయమైన హక్కుల కోసం బీఎస్పీ పోరాడుతోందన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మంగళ వారం ఆయన మూడు రోజుల రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
బహుజన రాజ్యాన్ని సాధించడమే అంబేడ్కర్‌కు మనమిచ్చే ఘన నివాళి అని వెల్లడించారు. ఈ మూడు రోజుల శిక్షణ తరగతుల ద్వారా బహుజన సిద్ధాంతాన్ని బోధిస్తామన్నారు. ప్రజలను చైతన్య పరచడం ద్వారా బీఎస్పీని అభివృద్ధి పరిచి బహుజన రాజ్యాధికారానికి దారులు వేస్తామన్నారు.