పేదవారి సొంతింటి కల నెరవేరుస్తామని డబుల్ బెడ్రూం పథకాన్ని తీసుకొచ్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. రాష్ట్రమంతా చాలా ప్రాంతాల్లో వాటి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే.. కొన్నిచోట్ల నిర్మాణాలు ఆగిపోవడం.. పూర్తయినా లబ్దిదారులకు ఇవ్వకపోవడంతో వారిలో అసహనం పెరిగిపోతోంది. కేటాయింపులు జరగకుండానే గృహప్రవేశాలు చేసేస్తున్నారు లబ్దిదారులు.
మరికొన్నిచోట్ల డబుల్ బెడ్రూం ఇళ్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. తాజాగా బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. నిర్మాణం జరిగి ఏళ్లు గడుస్తున్నా వాటిని ఇవ్వకపోవడంతో అవి ఎలా తయరయ్యాయో వివరిస్తూ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు ఆర్‌ఎస్పీ.
సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా పంపిణీకి నోచుకోలేదన్నారు ఆర్‌ఎస్ ప్రవీణ్. దీంతో ప్రస్తుతం అవి తాగుబోతులకు అడ్డాలుగా మారుతున్నాయని విమర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు.
కేసీఆర్ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు ఆర్‌ఎస్ ప్రవీణ్. ఈ నిరంకుశ, రాజ్యాంగ వ్యతిరేక పాలన నుండి తెలంగాణ తల్లికి విముక్తి కలిగించాలని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఉక్రెయిన్ పౌరుల మాదిరిగా వీరోచితంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు ఆర్‌ఎస్పీ.