ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వెనుక పెద్ద కుట్ర ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. శుక్రవారం ఆయన అలంపూర్ చౌరస్తాలోని బీఎస్పీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. బీఎస్పీ ఆధ్వర్యంలో ఈ నెల 26న ప్రజా సమస్యలపై బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు.
9 ఏళ్ల బీఆర్ఎస్ నిరంకుశ పాలనలో రైతులు, విద్యార్థుల పరిస్థితి ఘోరంగా ఉందని దుయ్యబట్టారు. వెయ్యి కోట్లు గజ్వేల్ కి పెట్టినప్పుడు మరి అలంపూర్ ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. అలంపూర్ అభివృద్ధికి బడ్జెట్ ఎందుకు పెట్టలేదన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి గులాం గిరి చేయబట్టే ఇక్కడి ప్రజలు అభివృద్ధికి నోచుకోని పరిస్థితి వచ్చిందన్నారు.
బీఆర్ఎస్ నాయకుల్లారా ఎన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారు? మీకు దమ్ముంటే ముఖ్యమంత్రితో కొట్లాడి అలంపూర్ ను అభివృద్ధి పథంలో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నీళ్ల కోసం కొట్లాడి.. ఇప్పుడు తెలంగాణ వచ్చినా నీళ్ల కోసం కొట్లాడటం తప్పలేదన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ సస్యశ్యామలంగా ఉండాలి కానీ అలంపూర్ మాత్రం ఎండిపోవాలా? అని ప్రశ్నించారు.
అదే విధంగా కాకతీయ యూనివర్సిటీలో మెడికో విద్యార్థి ప్రీతి విషయంలో కారకులపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని, యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ని ఎందుకు సస్పెండ్ చేయలేదని డిమాండ్ చేశారు. తెలంగాణలో దోపిడీ పాలన పోయి బహుజన రాజ్యం రావాలని పిలుపునిచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.