నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలు అయినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి మారిందని అన్నారు బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఆకలి చావుల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తునే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీలు, పీజీలు చదివి ఉద్యోగాలు రాక యువత హమాలీ పనికి పోతోందని అన్నారు.
వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్లో దాదాపు 1500 మంది గ్రాడ్యుయేట్లు హమాలీలుగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్తాకు మూడు రూపాయల చొప్పున కూలీపనికి వెళ్తున్నారని అన్నారు. ఎంత చదువు చదివినా చివరకు పత్తి, మిర్చి బస్తాలు మోయాల్సిన పరిస్థితి విద్యార్ధులకు పట్టించిన పాపం సీఎంకు తగులుతుందని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఇంతకన్నా ఎక్కువ మనకు ఏం ఒరగదని ఎద్దేవా చేశారు. ఇటువంటి పరిస్థితులు మారాలంటే బహుజన పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. బహుజన రాజ్య స్థాపనలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు నిరీక్షణ తప్పట్లేదని మండిపడ్డారు.
మన బంగారు భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలని అన్నారు ఆర్ఎస్పీ. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన నీలి జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. బహుజన రాజ్య ప్రతిష్ఠాపన కోసం యువత కలిసి రావాలని ట్వీట్ చేశారు ఆర్ఎస్పీ.