తెలంగాణలో మహిళలకు, యువతులకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ మధ్య బాలానగర్ మండలం తిరుమలగిరిలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన మహిళలు, యువతులు అర్థాంతరంగా తమ జీవితాలను ముగించుకునే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ఆరోపించారు.
తిరుమలగిరిలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం మద్యం మత్తులో ఉన్న యువకులే కారణమన్నారు. ఇటువంటి సంఘటనలు జరగడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమే అన్నారు. ఊరూరా.. వాడవాడలా వెలసిన బెల్ట్ షాపుల కారణంగా యువత మత్తులో మునిగి తేలుతున్నారన్నారు. ఆ మత్తులో పడి మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
35 వేల కోట్ల రూపాయల కోసం.. మూడు కోట్ల 75 లక్షల మంది ప్రజల జీవితాలపై ప్రభావం చూపేలా ప్రభుత్వం మద్యం షాపులను నిర్వహిస్తుందన్నారు. మరోవైపు ఇటువంటి దురాగతాలకు పాల్పడిన యువకులు జైలు పాలై వారి జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. వారిని నమ్ముకుని ఉన్న తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేస్తున్నారని పేర్కొన్నారు ప్రవీణ్ కుమార్.
డబ్బుల కోసం చూసుకుంటే ఇంకా ఎంతో మంది మహిళలు, విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయన్నారు. మీకు లిక్కర్ స్కాములు.. మాకేమో మరణ శయ్యలా? అని ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెట్లు షాపులను వెంటనే ఎత్తివేయాలని, లేకపోతే వాటిని ఎత్తివేసేందుకు బీఎస్పీ పోరాటాలు చేస్తుందని వెల్లడించారు. బాధిత కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.