వికారాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి బూతు పురాణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తాండూరు టౌన్ సీఐ రాజేందర్ రెడ్డిపై బండ బూతులతో విరుచుకుపడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వ్యవహారంలో మహేందర్ రెడ్డిపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా.. దీనిపై విపక్ష పార్టీల నేతలు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా.. బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
”కేసీఆర్ గారు.. మీ నాయకులకు నేర్పిన భాష ఇదేనా? సాక్షాత్తు పోలీసు అధికారులతోటే ఇంత మదంతో మీ నాయకులు మాట్లాడుతున్నారంటే.. ఇక వాళ్లు సామాన్య ప్రజలను ఎట్లజూస్తరో? హోం శాఖ మంత్రి గారూ, ఈ అహంకార ఎమ్మెల్సీని వెంటనే అరెస్టు చేయండి. బీఎస్పీ అధికారంలోకి వచ్చినప్పుడే రాష్ట్రంలో అధికారులు గర్వంగా, ధైర్యంగా విధులు నిర్వహించడం సాధ్యమవుతుంది.” అని ట్వీట్ చేశారు ప్రవీణ్.
ఇదే విషయమై రాష్ట్రం వ్యాప్తంగా ప్రతిపక్ష నేతలతో పాటు.. ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జరుగుతున్న అవమానాలకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.