మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడిపై స్పందించారు బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు బాగాలేకనే మల్లారెడ్డిపై ప్రజలు దాడి చేశారన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ప్రవీణ్.. కాలనీల్లో తిరుగుతూ ప్రజలతో మాట్టాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ మీద, మంత్రి మల్లారెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్‌ఎస్పీ. ఉద్యోగస్ధులకి జీతాలు, ఫించన్లు ఆపేశారని మండిపడ్డారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా ఉందన్న ఆయన.. బహుజనులకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక పర్యటనలో భాగంగా బయ్యారం ఐరన్ ఓర్ పెద్ద గుట్టను పరిశీలించారు ప్రవీణ్. బయ్యారం ఐరన్ ఫ్యాక్టరీపై టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు నాటకాలు అడుతున్నాయని విమర్శించారు. ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే వేలాది మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు.
రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి కేటీఆర్.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఎందుకు నోరు విప్పరని ప్రశ్నించారు ఆర్‌ఎస్పీ. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.