రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో చూశాం. రాష్ట్రమంతా సీఎం దిష్టిబొమ్మ దహనాలు జరిగాయి. దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష నేతలు ఇలా అన్ని వర్గాల నుంచి కేసీఆర్ కు నిరసన సెగ తగిలింది. అయితే.. మొన్నటి ప్రెస్ మీట్ లో రాజ్యాంగం మార్చాల్సిందేనన్న తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు కేసీఆర్.
సీఎం బహిరంగ క్షమాపణలు చెప్పాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో కేసీఆర్ ను వ్యతిరేకిస్తూ వీడియోలు పోస్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురిపై టీఆర్ఎస్ నేతలు కేసులు పెడుతున్నారు. దీనిపై స్వేరోకు చెందిన విజయ ట్వీట్ చేయగా ఆర్ఎస్ ప్రవీణ్ రీట్వీట్ చేశారు.
‘కేసీఆర్ గారు.. తమరు రాయబోతున్న రాజ్యాంగంలో మాకు మాట్లాడే హక్కులు కూడా ఉండవన్న మాట! అందుకే మీ అనుచరులతో ప్రజలపై రోజూ అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. మీరు ప్రజలపై వాడిన అహంకారపు భాషపై మేమెన్ని కేసులు పెట్టాలి? మా ఆత్మగౌరవం కోసం దేనికైనా సిద్దమైనోళ్లం.. నీ కేసులకు భయపడతామా’ అంటూ పోస్ట్ పెట్టారు ఆర్ఎస్పీ.
ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. రాజ్యాంగం మార్చొద్దు అన్నందుకు కేసులు పెట్టిస్తారా? అంటూ బీఎస్పీ శ్రేణులు మండిపడుతున్నారు. ఇంకా ఎన్నాళ్ళు ఈ దురాగతాలు.. కేసీఆర్ గద్దె దిగేరోజు వచ్చిందంటూ విమర్శిస్తున్నారు.