పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 32 బిల్లులను ఆమోదం కోసం కేంద్రం లిస్ట్ చేసింది. సమావేశాలు ప్రారంభం అయి ఇప్పటికి రెండు వారాలు గడుస్తున్నాయి. కానీ నిత్యావసరాలపై జీఎస్టీ పెంపు, ద్రవ్యోల్బణాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభల్లో ఆశించిన స్థాయిలో కార్యకలాపాలు జరగలేదు.
వర్షాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు లోక్ సభ కేవలం 16 గంటల పాటు మాత్రమే పని చేసింది. మరోవైపు పెద్దల సభలోనూ పెద్దగా కార్యకలాపాలు జరగలేదు. ఈ సమావేశాల్లో ఇప్పటి వరకు పెద్దల సభ 11గంటల పాటు పనిచేసింది. గత వారంలో చివరి రెండు రోజుల్లో లోక్ సభలో నలుగురు, రాజ్యసభలో 23 మంది సస్పెన్షన్ కు గురయ్యారు.
రెండోవారంలో పెద్దల సభ ఉత్పాదకత 16.49శాతంగా నమోదైంది. అంతకు ముందు వారంలో అది 26.90శాతంగా ఉంది. మొత్తం మీద ఈ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ ఉత్పాదకత 21.58శాతంగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజ్యసభ జులై 18న ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 10 సార్లు సమావేశమైంది.
ఈ సమావేశాల్లో రాజ్యసభ కేవలం11గంటల 8 నిమిషాలు మాత్రమే పనిచేసింది . షెడ్యూల్ ప్రకారం ఈ రెండు వారాల్లో పెద్దల సభ 51 గంటల 35 నిమిషాలు పనిచేయాల్సి ఉంది. అంటే. ఈ లెక్కన చూస్తే ఇప్పటికే సుమారు 40గంటల 45 నిమిషాల సమయం వృథా అయింది.
ఈ సమావేశాల్లో రాజ్యసభలో ఒక్క బిల్లు కూడా పాస్ కాలేదు. గడిచిన రెండు వారాల్లో క్వశ్చన్ హవర్ కూడా ఆరు రోజులు పాటు జరగకపోవడం గమనార్హం. అటు లోక్‌సభలోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. విపక్షాల నిరసనల నడుమ సభను స్పీకర్ పలు మార్లు వాయిదా వేస్తున్నారు.