– టీఆర్ఎస్ కు రూల్స్ వర్తించవా?
– గుంపులు గుంపులుగా సభలు, సంబరాలా?
– ప్రతిపక్షాలపైనే ఎందుకీ కక్ష?
– డీజీపీని నిలదీసిన ఆర్ఎస్పీ
కరోనా రూల్స్ తో ప్రతిపక్షాల ప్రోగ్రామ్స్ ని అడ్డుకుంటోంది ప్రభుత్వం. కానీ.. టీఆర్ఎస్ కార్యక్రమాలకు మాత్రం ఎలాంటి అడ్డంకులు లేవు. మాస్క్ లు లేకుండా గులాబీ దళం గుంపులు గుంపులుగా తిరిగుతున్నా అడిగేవాడు లేడు. తమకు ఎదురు ఎవరు అనే ధైర్యంతో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నా పోలీసులు కళ్లప్పగించి చూడడమే తప్ప ఏం చేయలేని పరిస్థితి. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
తెలంగాణలో కేవలం ప్రతిపక్షాలకు మాత్రమే ఒమిక్రాన్ రూల్స్ వర్తిస్తాయా? అని ట్విట్టర్ లో ప్రశ్నించారు ఆర్ఎస్పీ. జనవరి 3 నాడు నార్నూర్ లో తమ సభను పోలీసులు కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తామని హామీ ఇచ్చినా రద్దు చేశారని గుర్తు చేశారు. అలాంటిది అదే నార్నూర్ లో జీవో 1 ఉండగానే టీఆర్ఎస్ మంత్రుల సంబరాలకు ఎలా పర్మిషన్ ఇచ్చారని డీజీపీ మహేందర్ రెడ్డిని నిలదీశారు.
తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు సంబరాలు నిర్వహిస్తోంది టీఆర్ఎస్. నిజానికి ఇవి 10వ తేదీ లోపే అయిపోవాలి. కానీ.. సంక్రాంతి వరకు పొడిగించారు. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నా ఇంకోవైపు సంబరాల పేరుతో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. చాలాచోట్ల మాస్క్ లు ముక్కుకు కాకుండా గడ్డానికి తగిలించుకుని కనిపిస్తున్నారు.
బుధవారం నార్నూర్ లో మంత్రులు ఇంద్రకరణ్, సత్యవతి రాథోడ్ పర్యటించారు. వీరి రాక సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద సభ కూడా నిర్వహించారు. వాటికి సంబంధించిన ఫోటోలనే ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని, డీజీపీని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్. మరో ట్వీట్ లో ‘ఒమిక్రాన్ స్ప్రెడర్ టీఆర్ఎస్’ అనే యాష్ ట్యాగ్ తో స్వేరో నవీన్ పోస్ట్ ను రీట్వీట్ చేశారు.