రజత్ కుమార్ అంశంపై తనదైన స్టయిల్ లో స్పందించారు బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మధ్యాహ్న భోజన కార్మికుల బాధలను వివరిస్తూ రజత్ వ్యవహారాన్ని హైలెట్ చేస్తూ ట్విట్టర్ లో ప్రభుత్వానికి చురకలంటించారు.
తెలంగాణలో మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమ దోపిడీ యథేచ్ఛగా జరుగుతోందని అన్నారు ఆర్ఎస్పీ. వాళ్లేమైనా ‘ఫలక్ నుమా ప్యాలెస్ లో మెగా దావత్ లు అడుగుతున్నారా? నెలకు వెయ్యి రూపాయల జీతం ఎటు సరిపోదు, కనీస వేతనమైనా ఇవ్వమంటున్నారు. మీకు కామధేనువులైన మెగా కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన కోట్లిస్తున్నారు.. మరి పేద ప్రజలు?’ అంటూ ట్వీట్ చేశారు.
శుక్రవారం కూడా రజత్, మెగా వ్యవహారంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్. ‘ఇది మాత్రమే ఎలాగో బైటకు లీకైంది. ఇంకా వెలుగు చూడని ఒళ్లు గగుర్పొడిచే కోట్ల కుంభకోణాలు కోటి ఎకరాల మాగాణి తదితర ప్రాజెక్టుల వెనుక ఉన్నాయి. ఇన్నాళ్లు మెక్కిన కోట్లాది ప్రజాధనాన్ని గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర పెట్టి ముక్కు నేలకు రాయండి. లేకపోతే తెలంగాణ ప్రజలే మీతో కక్కిస్తారు’ అంటూ విమర్శలు చేశారు.
రజత్ కుమార్ కుమార్తె వివాహానికి సంబంధించిన బిల్లులను మెగా సంస్థ చెల్లించడంపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ప్రభుత్వ అధికారి ఇంట్లో పెళ్లికి ఓ కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించారంటే ఏ రేంజ్ లో లాబీయింగ్ జరిగిందో అర్థం అవుతోందని.. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ఇప్పటికే డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.