కేంద్రంపై సీపీఐ జాతీయ జనరల్ సెక్రటరీ డి. రాజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ పాలన గాడి తప్పిందని ఆయన విమర్శించారు. మోడీ పాలనలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోయిందని ఆయన అన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రధాని మోడీ నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పారు.
బీజేపీ పాలనలో అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగిపోతున్నాయని ఆయన తెలిపారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి నిర్వహించడంపై జాతీయ లా కమిషన్ తమ అభిప్రాయం కోరిందని చెప్పారు. రెండు ఎన్నికలు ఒకే సారి జరపాలన్నది సంఘ్ పరివార్ విధానమన్నారు.
ఆ రెండు ఎన్నికలు ఒకే సారి నిర్వహించడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం బాధ్యత గల ప్రభుత్వం కాదన్నారు. నోట్ల రద్దుపై సుప్రీం కోర్టు తీర్పుపై ఆయన స్పందించారు. ఈ విషయంలో కోర్టు ఏకపక్షంగా తీర్పు ఇవ్వలేదన్నారు. ఇందులో భిన్నాభిప్రాయాలతో కూడిన తీర్పును ధర్మాసనం వెలువరించిందన్నారు.
ఈ విషయంలో కేంద్రం పార్లమెంట్ ను సంప్రదించలేదన్నారు. నోట్ల రద్దుపై మోడీ చెప్పిన ఒక్క కారణం కూడా సరిగా లేదని పేర్కొన్నారు. పేదవారిపై నోట్ల రద్దు తీవ్రంగా ప్రభావం చూపిందన్నారు. డీమానిటైజేషన్ నిర్ణయాన్ని ప్రధాని మోడీ తీసుకుని దాన్ని ఆర్బీఐపై రుద్దారని ఆరోపించారు.
ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి దేశంలో సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నాయని చెప్పారు. గవర్నర్ కార్యాలయాలను వినియోగించుకుంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరిలోనూ అదే జరుగుతోందన్నారు.
సమగ్ర ఎన్నికల విధానంలో మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలకు కార్పొరేట్‌ల ఫండింగ్ విధానం వద్దని తాము వాదించామన్నారు. కానీ బీజేపీ బలవంతంగా ఈ బిల్లును ఆమోదించుకుందన్నారు. బాండ్స్ రూపంలో భారీగా నిధులు సేకరిస్తోందని ఆరోపించారు. ఒక్క భాషను దేశ ప్రజలపై రుద్దాలని చూస్తోందన్నారు.