పాకిస్తాన్ లో ప్రజలు ఏ మాత్రం సంతోషంగా లేరని, కానీ ఇండియాలోని వారు హ్యాపీగా ఉన్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. భారత్-పాక్ విభజన జరిగి ఏడు దశాబ్దాలుపైగా అయినప్పటికీ ఈ పరిస్థితి ఉందని, విభజన పొరబాటుగా జరిగిందని పాక్ ప్రజలు భావిస్తున్నారని ఆయన తెలిపారు. యువ విప్లవకారుడు హేము కలానీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన సింధీలు దీనికి హాజరయ్యారు. ‘అఖండ్ భారత్’ అన్నది సత్యమేనని, కానీ విభజించిన భారత్ ‘పీడకల’ అని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. భారత-పాకిస్తాన్ విభజన పొరబాటని నేడు పాక్ ప్రజలు అంటున్నారని పేర్కొన్న ఆయన.. ఇండియా నుంచి తమ సంస్కృతికి దూరమైన వాళ్ళు ఇంకా సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఇండియాకు వచ్చినవారు ఈ రోజున సంతోషంగా ఉన్నా.. ఆ దేశంలోని వారికి మాత్రం ఈ ఆనందం లేదని అన్నారు.
అఖండ్ భారత్ అన్న కాన్సెప్టే గొప్పదని, ఇదే సమయంలో నవ భారతాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ‘అఖండ్ భారత్ .. ప్రస్తుతం ఆధునిక ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారత దేశం, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, టిబెట్ ల లోని అన్ని ప్రాచీన భాగాలతో కూడిన దేశం నిజమైతే విభజించబడిన ఇండియా అన్నది మాత్రం ఓ పీడకల అని వివరించారు.
భారత–పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాల క్షీణత గురించి ప్రస్తావించిన ఆయన.. ఇతరులపై దాడి చేసే సంస్కృతిని ఇండియా సహించబోదని అన్నారు. పాకిస్తాన్ పై ఇండియా దాడి చేయాలన్నది తన ఉద్దేశం కాదని, ఇలాంటి సంస్కృతి మనకు లేదని చెప్పారు. అయితే స్వయం రక్షణకు మనలను మనం సన్నద్ధులను చేసుకోవలసి ఉందంటూ ఈ సందర్భంగా సర్జికల్ దాడులను పరోక్షంగా సమర్థించారు. ఇది అనివార్యమన్నారు.