ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై శివాజీ కాలేజీలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ప్రసంగిస్తూ… ప్రతీ దానికి చైనాపై ఆధారపడటం కరెక్ట్ కాదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో.. ఆ దేశం ముందు మోకరిల్లాల్సి వస్తుందని చెప్పారు. దానికి భిన్నంగా ఉండాలంటే మనం అన్నింటా స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంటర్నెట్ ను, టెక్నాలజీని వాడుతున్నామని.. కానీ.. మన దగ్గర వాటికి సంబంధించిన అసలు టెక్నాలజీ లేదన్నారు మోహన్ భగవత్. దానికోసం బయటి దేశాలపై ఆధారపడుతున్నామని గుర్తుచేశారు. అలాగే చైనా వస్తువులను బహిష్కరించాలని చెబుతాం.. కానీ.. మొబైల్ ఫోన్లలో వాడే ప్రతీది ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. అన్నింటికీ చైనాపైనే ఆధారపడుతున్నామని అన్నారు.
అసలు.. స్వదేశీ అంటే అన్నింటినీ బహిష్కరించడం కాదన్నారు మోహన్ భగవత్. అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగాలని.. కానీ.. అది మనకు అనుగుణంగా జరగాలని వ్యాఖ్యానించారు. అందుకోసం మనం స్వావలంబన సాధించాలని.. దానితోనే ఉపాధి కల్పన సాధ్యమవుతుందని చెప్పారు. ఒకవేళ మన ఉద్యోగాలు బయటికి వెళ్లిపోతే హింసకు దారిచ్చినట్లేనని.. అందుకే స్వదేశీ అంటే స్వావలంబన.. హింస కాదు అని వివరణ ఇచ్చారు.