నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన జీవితాన్నంతా దేశానికి అంకితం చేశారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని షాహీద్ మినార్ మైదానంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం దాదాపు అజ్ఞాతవాసం లాంటిదేనని ఆయన అన్నారు. నేతాజీ తన జీవితంలో అధిక భాగం ప్రవాసంలోనే గడిపారని తెలిపారు.
నేతాజీ ఉన్నత చదువులు చదివారని, ఆయన కోరుకుని వుంటే విలాసవంతమైన జీవితాన్నిగడిపి వుండేవారని చెప్పారు. కానీ నేతాజీ అలా చేయలేదన్నారు. దేశం కోసం నేతాజీ తన సర్వస్వం త్యాగం చేశారన్నారు. నేడు ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తోందన్నారు.
నేతాజీ కన్న కలలు ఇంకా నెరవేరలేదని వెల్లడించారు. అందరు కలిసి వాటిని సాధించాలని ఆయన సూచించారు. నేతాజీ చూపిన మార్గంలో అందరూ నడవాలని ఆయన పిలుపునిచ్చారు. నేతాజీ మార్గంలో నడవడం ద్వారా ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వాన్ని వ్యాప్తి చేయవచ్చన్నారు.