కర్ణాటకలో తన భారత్ జోడో పాద యాత్రలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. శనివారం బీజేపీ.. ఆర్ఎస్ఎస్ పై నిప్పులు చెరిగారు తుంకూరు లో మీడియాతో మాట్లాడిన ఆయన.. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేనేలేదన్నారు. బ్రిటిష్ వారికి ఈ సంస్థ సాయపడుతూ వచ్చిందని, వారి నుంచి దామోదర్ సావర్కర్ స్టయిపెండ్ తీసుకునేవారని ఆయన ఆరోపించారు. అసలు ఆ నాడు ఆర్ఎస్ఎస్, బీజేపీ ఉనికి ఎక్కడ ? మన దేశ స్వాతంత్య్ర పోరాటంలో వాటి సహకారం ఎక్కడని ప్రశ్నించారు.
ఇలాంటి వాస్తవాలను బీజేపీ దాచజాలదన్నారు. కాంగ్రెస్ పార్టీ, దీని నేతలు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని, ప్రజలకీ విషయం తెలుసునని ఆయన చెప్పారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్రం విధించిన నిషేధాన్ని ప్రస్తావిస్తూ.. ద్వేషాన్ని, హింసాత్మక చర్యలను రెచ్చగొట్టే. లేదా వ్యాప్తి చెందింపజేసే ఏ సంస్థ అయినా జాతి వ్యతిరేకమేనని, అలాంటి సంస్థల సభ్యులపై ఇండియా పోరాడవలసిందేనని అన్నారు. వీరిని తీవ్రంగా ఎదుర్కొనవలసిందేనని రాహుల్ పేర్కొన్నారు.
వాళ్ళు ‘రిమోట్ కంట్రోల్’ కాదు
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, శశిథరూర్ ఇద్దరూ ఉన్నత భావాలు గలవారేనని, ‘రిమోట్ కంట్రోల్’ అని వారిని వ్యవహరించడం తగదని రాహుల్ గాంధీ చెప్పారు. పార్టీ చీఫ్ గా ఎవరు ఎన్నికయినా వారికి పార్టీలో ఎలాంటి అధికారాలు ఉండవని, హైకమాండ్ చేతిలో వారు ఇలా వ్యవహరించాల్సిందేనని కొన్ని వర్గాల నుంచి వస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
‘వీరిద్దరికీ వారివారి దృక్పథాలు ఉన్నాయి.. పార్టీ పట్ల వారికి మంచి అవగాహన ఉంది. ఇద్దరూ దూరదృష్టి గలవాళ్లే .. అలాంటిది రిమోట్ కంట్రోల్ అని వ్యవహరించడం వారిని అవమానించినట్టే అవుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.