తమ ఆర్ధిక వ్యవస్థలను ఎంతో మెరుగుపరచుకున్న ప్రపంచంలోని దేశాల్లో ఇండియా ఆరో అతి పెద్ద దేశమైనప్పటికీ, ఇక్కడ పేదరికం, నిరుద్యోగం ఇంకా పట్టిపీడిస్తున్నాయని ఆర్ఎస్ఎస్ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి ఈ సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. వీటికి ఆర్థిక అసమానత కూడా తోడయిందని.. ఇవి దేశానికి పెను సవాళ్లుగా మారాయని ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబాలె వ్యాఖ్యానించారు. స్వావలంబనలో ఇండియా సత్తా నిరూపించుకుంటోందని, ప్రపంచ దేశాలు కూడా దీన్ని అంగీకరించాయని ఆయన చెప్పారు.
‘ఇటీవలి కాలంలో ఆర్ధిక రంగంలో మన దేశం జయప్రదంగా దూసుకుపోతున్నా.. ఇలాంటి కొన్ని సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాల్సి ఉంది.. తొమ్మిది రోజుల నవరాత్రుల్లో విజయదశమి నాడు దుర్గామాత రాక్షసులను ఎలా మట్టుబెట్టిందో.. అలాగే దశాబ్దాలుగా మనం ఎదుర్కొంటున్న ఈ సవాళ్ళనుంచి కూడా బయటపడాల్సి ఉంది’అని వ్యాఖ్యానించారు. పేదరికం, నిరుద్యోగం వంటివి కూడా ‘రాక్షసుల్లాంటివే’ అన్నారు.
తన ‘భారత్ స్వావలంబీ భారత్ అభియాన్’ ప్రచారంలో భాగంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశ్ జాగరణ్ మంచ్ నిర్వహించిన వెబినార్ లో మాట్లాడుతూ ఆయన.. దేశంలో ఇంకా 20 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారని, ఇది చాలా ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. సుమారు 23 కోట్లమందికి పైగా పేదలు రోజుకు 375 రూపాయల కన్నా తక్కువ ఆదాయం సంపాదిస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో నాలుగు కోట్లమంది నిరుద్యోగులున్నట్టు లేబర్ ఫోర్స్ సర్వే గత జూన్ లో వెల్లడించిందని, నిరుద్యోగ రేటు 7.6 శాతం ఉందని పేర్కొన్నారు.
పదేళ్ల క్రితంతో పోలిస్తే గత కొన్నేళ్లలో పరిస్థితి కొంతవరకు మెరుగుపడిందని దత్తాత్రేయ హొసబాలె చెప్పారు. నాడు ఇది 22 శాతం ఉండగా ఇప్పుడు 18 శాతం ఉందన్నారు. ఆర్ధిక అసమానతల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇదివరకటి లోపభూయిష్ట పాలసీల కారణంగా గ్రామాల నుంచి నగరాలకు పెద్ద ఎత్తున వలసలు పెరిగాయని, గ్రామాలు ఖాళీ అవుతుండగా, నగరాలు నరకాలుగా మారుతున్నాయని ఆయన చెప్పారు. అయితే అనేక మార్పులు తెచ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు.