నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో ఇవాళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భారీ కవాతు నిర్వహించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభం కానున్న ఈ ర్యాలీకి పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. దాదాపు 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే బైసాంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మార్చ్ కు ఐదు రోజుల క్రితం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వహించాలని ఆదేశించింది. ఇక ర్యాలీకి అనుమతిస్తూనే… కొన్ని షరతులను పెట్టింది హైకోర్టు. 500 మంది మాత్రమే ర్యాలీలో పాల్గొనాలని, మసీదుకు 300 మీటర్ల దూరంలో ర్యాలీ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది.
ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేనివారే ర్యాలీలో పాల్గొనాలన్న రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మసీదు దగ్గర ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. ర్యాలీలో పాల్గొనే వారు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో.. ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. పోలీసు శాఖ అన్నీ జాగ్రత్తలు తీసుకుంటుంది.