ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు ఐఎస్ఐ, నక్సలైట్లు, ఛాందసవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ నెల 10న బిహార్‌లోని భగల్‌పూర్ పర్యటించనున్న నేపథ్యంలో ఆయనకు బెదిరింపులు వచ్చినట్టు చెప్పారు.
మోహన్ భగవత్ కు బెదిరింపుల నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ఆయన పర్యటన కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను పోలీసులు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను ఎస్ఎస్పీ ఆనంద్ కుమార్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ధనంజయ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
మోహన్ భగవత్ సందర్శించబోయే మహర్షి గుహను ఎస్‌ఎస్పీ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులకు ఆయన సూచనలు చేశారు. మోహన్ భగవత్ పర్యటన నేపథ్యంలో అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్టు చెప్పారు.
భద్రతకు సంబంధించి ఎలాంటి లోపాలు ఉండబోవని ఆయన వెల్లడించారు. సీసీటీవీ ద్వారా నిఘా పెట్టామన్నారు. కొంత మంది పోలీసులు మఫ్టీలో ఉంటారని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 10న మహర్షిలోని కుప్పఘాట్ ఆశ్రమంలో సద్గురు నివాసాన్ని ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. మోహన్ భగవత్ కార్యక్రమం మూడు గంటల 45 నిమిషాల పాటు సాగనుంది. పర్యటనలో భాగంగా మహర్షి మెహి తపస్సు చేసిన ప్రసిద్ధ గుహను కూడా సందర్శించనున్నారు.