– తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
– అధికారమే లక్ష్యంగా.. రాష్ట్రానికి అమిత్ షా
– 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై కసరత్తు
– సీక్రెట్ సర్వే నిర్వహించిన ఆర్ఎస్ఎస్
ఆపరేషన్ సౌత్ లో భాగంగా కాషాయ జెండాను రెపరెపలాడించాలన్న లక్ష్యంతో బీజేపీ అగ్రనాయకత్వం అడుగులు వేస్తోంది. ముందుగా తెలంగాణతో ఖాతా ఓపెన్ చేయొచ్చని పావులు కదుపుతోంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ఎజెండాను ఫిక్స్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ బిగ్ షాట్స్ వరుసగా తెలంగాణ పర్యటనలు పెట్టుకోవడమే ఉదాహరణగా చెబుతున్నారు రాజకీయ పండితులు.
అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలే సమయం ఉంది. దీంతో బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై మరింత ఫోకస్ పెంచింది. పార్టీ అగ్రనేతలు వరుస పర్యటనలతో వేడిని పెంచుతున్నారు. 19న మోడీ రావాల్సి ఉన్నా వాయిదా పడింది. అయితే.. ఆ లోటును భర్తీ చేసేందుకు అమిత్ షా రంగంలోకి దిగారు. ఆ తర్వాత మోడీ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. ఇలా అగ్ర నేతలు తెలంగాణకు సమయాన్ని కేటాయిస్తుండడం బీజేపీ జాతీయ నాయకత్వం ఎన్నికలను ఈసారి ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థం అవుతోంది.
ఈనెల 28న అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అంతకంటే ముందు జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ రెండు రోజులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణ గడ్డపై జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయదళం.. గులాబీ తోటలో కమలాన్ని వికసింపచేయడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అందివచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ ను ఎండగట్టడమే లక్ష్యంగా పనిచేస్తోంది. సభలు, సమావేశాల పేరిట బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటనలకు సమయాన్ని కేటాయిస్తున్నారు.
ఇప్పటికే ఎన్నికల క్యాలెండర్ ను సిద్ధం చేసుకున్న పార్టీ.. మూడు నెలలకు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించి అందుకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. సునీల్ బన్సల్ పార్లమెంట్ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. రెండు రోజుల పర్యటనలో పార్టీ పటిష్టత, ప్రజా సమస్యల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై ఆయన చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్ ప్రణాళికలు, బీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలు వాటిపై ప్రజా ఉద్యమాలను కార్య రూపంలోకి తెచ్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను రూపొందిస్తోంది బీజేపీ. మోడీ గతేడాది నాలుగు సార్లు తెలంగాణకు రాగా, అమిత్ షా ఐదుసార్లు పర్యటించారు. కమలదళపతి నడ్డా సైతం నాలుగు సార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చారు.
ఇక ఈసారి పర్యటనలో అమిత్ షా అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలన్న అంశంపై దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. పార్టీ శ్రేణులు, నాయకులతో పాటు ఆర్ఎస్ఎస్ నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆర్ఎస్ఎస్ ఓ సీక్రెట్ సర్వే నిర్వహించింది. దానిపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. అభ్యర్థుల విషయంలో కొన్ని సూచనలు చేయనున్నారని సమాచారం. మొత్తానికి ఈసారి ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు అనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.