కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య చెడ్డీ వార్ నడుస్తోంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్ధరామయ్య చేసిన ప్రకటనతో వివాదం మొదలైంది.
రాష్ట్రంలో పాఠ్య పుస్తకాలను కాషాయీకరణ చేస్తున్నారంటూ ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు ఆరోపణలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ ఇంటి ఎదుట ఎన్ఎస్ యూఏ నాయకులు ధర్నాకు దిగారు.
ఈ సందర్బంగా మాట్లాడిన సిద్దరామయ్య బీజేపీ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఖాకీ నిక్కర్(ఆర్ఎస్ఎస్ కు సంబంధించింది)కు నిప్పంటించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
మంత్రి ఇంటిని తగులబెట్టేందుకు ఎన్ఎస్ యూఐ నాయకులు ప్రయత్నించారని వారిపై బీజేపీ నేతలు కేసులు పెట్టారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఖాకీ నిక్కర్ల దహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
దీంతో కాంగ్రెస్ తీరును సంఘ్ పరివార్ నేతలు వ్యతిరేకరించారు. ప్రతిగా చడ్డీ క్యాంపెయిన్ పేరిట ఇంటింటికి తిరిగి చెడ్డీలను సేకరించి వాటిని కాంగ్రెస్ కార్యాలయానికి పంపుతున్నారు.