ఇటీవల ఆర్టీసీ బస్సులు కూడా చోరీకి గురవుతున్నాయి. కర్ణాటకలో ఒక ఆర్టీసీ బస్సు దొంగతనానికి గురవ్వగా.. చివరకు అది తెలంగాణలో కనిపించింది. కర్ణాటక, తెలంగాణ పోలీసుల గాలింపు చర్యలతో బస్సు ఆచూకీ లభ్యమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..కర్ణాటకలోని చించొల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో పార్కింగ్ చేసిన కేఏ38ఎఫ్971 నెంబర్ గల బస్సును ఒక వ్యక్తి దొంగతనం చేశాడు.
మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బస్సును తీసుకెళ్లిపోయాడు. ఇది గమనించిన బస్టాండ్‌లోని ఆర్టీసీ సిబ్బంది.. గుల్బర్గా డీసీ వీరేష్‌కి సమాచారం అందించారు. ఆయన బస్సు చోరీపై చించొల్లి పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. దీంతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి బస్సు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
సీసీ కెమెరాల ఆధారంగా బస్సు కదలికలను గమనించారు. వివిధ ప్రాంతాల్లోని సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. వీటి ఆధారంగా తెలంగాణ సరిహద్దులోని తాండూరు వైపు బస్సు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో తాండూరు పోలీసులు సహాకారం తీసుకున్న పోలీసులు.. బస్సు కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాండూరు మండలంలోని భూకైలాస్ వద్ద చోరీకి గురైన ఆర్టీసీ బస్సు లభ్యమైంది. బస్సును స్వాధీనం చేసుకుని కర్ణాటక తీసుకెళ్లారు.
కేవలం 12 గంటల్లోనే పోలీసులు బస్సు ఆచూకీ కనిపెట్టారు. అయితే నిందితుడు ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటక, తాండూరు పోలీసుల సహాయంతో బస్సు లభ్యం కావడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి కర్ణాటకలో దొంగతనానికి గురైన ఆర్టీసీ బస్సు.. తాండూరులో దొరకడం ఆసక్తికరంగా మారింది.