తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉదృతంగా నడుస్తోంది. తమ సమస్య ల మీద చేస్తున్న పోరాటం అని కాకుండా, తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటంగా కార్మికులు సమ్మె చేస్తున్నారు.మామూలుగా తమ సమస్యల కోసం, జీతాల పెంపు కోసం కార్మికులు చేసే సమ్మె లో మిశ్రమ స్పందన ఉండేది. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే సంఘాలు కనిపించేవి. కొన్ని సంఘాలు సైలెంట్ గా ఉండేవి. రోజులు గడిచే కొద్ది సమ్మె బలహీన పడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఆర్టీసీ సమ్మె తెలంగాణ ఉద్యమ కాలంలో చేసిన సకల జనుల సమ్మెను తలపిస్తోంది.
ఏ ఒక్క కార్మికుడు నా ఉద్యోగం పోయింది అన్న విషయాన్ని మర్చిపోయి, తమ సంస్థను ప్రైవేట్ వాడి చేతిలోకి వెళ్లకుండా యుద్దం చేస్తున్నాడు. మరో తెలంగాణ పోరాటం చేస్తున్నాడు.ఏ ఒక్క కార్మికుడు కూడా ఎంత కాలం ఈ సమ్మె అని కూడా అడగటం లేదని, ఉద్యమ స్పూర్తితో ముందుకెళ్తున్నారంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ఇక పాత గొడవలను పక్కన పెట్టి, ఆర్టీసీ జేఏసీ నాయకులు కూడా ఐక్యతతో పోరాడుతున్నారు. ఏదైతే అదైంది ఇక ముందుకే అని నినదిస్తున్నారు.
ఆర్టీసీ కార్మికులు ఇంత పట్టుదలతో , ఉద్యోగం పోయినా సరే అని ఉద్యమం చేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వమే. 50 వేల కుటుంబాలను రోడ్డు మీద పడేయడం ఆర్టీసీ ఉద్యోగుల గుండెలను రగిల్చింది. ఆర్టీసీ కార్మికుల ఆత్మ గౌరవాన్ని దెబ్బకొట్టెలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. తెలంగాణ సమాజం తిండి లేకపోయినా బతుకుతారు కానీ ఆత్మ గౌరవం దెబ్బతింటే ఎలాంటి వాడైన, ఎంతటి గొప్పోడైన వారి ఆగ్రహానికి గురి కాక తప్పదు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది ఇందు కోసమే. ఇప్పుడు మళ్లీ అదే జరుగుతోంది. మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. సకల జనుల సమ్మె లో 40 రోజులకు పైగా పోరాడిన మనం, మన ఉద్యోగాలు తీసేస్తే ఎలా ఊరుకుంటాం అని రోడ్డు మీదకొచ్చి ఉద్యమం చేస్తున్నారు కార్మికులు. కచ్చితంగా ఈ ఆత్మ గౌరవ పోరాటంలో తెలంగాణ ప్రజలదే అంతిమ విజయం అవుతుంది అనడంలో సందేహం లేదు. ప్రభుత్వం ఇక ముందు తీసుకునే చర్యల మీదే ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంటుంది. ఆర్టీసీ కార్మికుల ఉద్యమం మాత్రం ఆగే పరిస్థితి కనిపించట్లేదు.