చివరి డెడ్‌లైన్ అంటూ కేసీఆర్ చేస్తున్న ప్రకటనలను ఆర్టీసీ కార్మికులు లైట్ తీసుకుంటున్నట్లే కనపడుతోంది. చివరి అవకాశం లేకపోతే ఆర్టీసీ ఉండదు… ఉద్యోగాలు ఉండవు అంటూ కేసీఆర్ అండ్ టీం ప్రకటనలు చేస్తున్నా సరే ప్రభుత్వానికి ఆశాజనక వాతావరణం కనపడటం లేదు.
ఆర్టీసీ సమ్మె ఇప్పటికే 32వ రోజుకు చేరింది. అయినా కార్మికులు మొక్కవోని ధైర్యంతో, ప్రభుత్వ బెదిరింపులను పట్టించుకోవటం లేదు. కార్మికులంతా ఐక్యంగా పోరాటం చేస్తాం అని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. అయితే, డెడ్‌లైన్‌కు మంగళవారం చివరి రోజు కావటం… ప్రభుత్వం కూడా ఇంకాస్త దిగివచ్చి… మీరు ఎక్కడైన ఉద్యోగాల్లో చేరవచ్చు, మీ డిపోల్లోనే అవసరం లేదంటూ ప్రకటన ఇవ్వటంతో కార్మికులు ఆలోచనలో పడే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే, కార్మికు సంఘాలు మాత్రం కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేసింది. నవంబర్7న హైకోర్టులో మరోసారి సమ్మెపై విచారణ ఉండటం, హైకోర్టు కూడా ఇప్పటి వరకు జరిగిన విచారణలో ప్రభుత్వ తీరును తూర్పారబట్టడంతో… కార్మికులు న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. అవసరమయితే సుప్రీంకు వెళ్తాం తప్పా మేం వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటున్నారు కార్మికులు.