ఆర్టీసీ సమ్మెకు కార్మిక సంఘాలు నేటితో ముగింపు పలకనున్నాయా…? హైకోర్టు మీరే తేల్చుకోండి అని చెప్పేయటంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు ముగింపు పలికేందుకే మొగ్గు చూపుతున్నాయా…? అండగా నిలబడతారనుకున్న ప్రతిపక్షాలు హ్యండ్సప్ చేయటంతో కార్మిక సంఘాలు తీవ్ర నిరాశలో ఉన్నాయా…?
అవును. ఇప్పుడు ఆర్టీసీ సమ్మెకు ముగింపుపైనే సర్వత్రా చర్చ నడుస్తోంది. హైకోర్టు తీర్పు… విచారణ అంశాలను చూస్తే ప్రభుత్వానిదే పైచేయి అని చెప్పక తప్పదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కార్మిక సంఘాలు, కార్మికులు ఏం చేస్తారన్నది కీలకంగా మారింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు తమ భవిష్యత్ ఆందోళనలను ఇప్పటికే విరమించుకున్నాయి. ఇక ఆర్టీసీ కార్మికులకు సమ్మె విరమించకతప్పని పరిస్థితిలోకి నెట్టబడ్డట్టు స్పష్టమవుతోంది.
అయితే, సమ్మె విరమించక తప్పదు కానీ… లేబర్ కోర్టు విచారణ తర్వాత సమ్మె విరమిస్తారా…? ముందేనా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న అని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. ప్రభుత్వం హైకోర్టులో వాదించిన ప్రకారం చట్టబద్ధంగా సమ్మెకు వెళ్లలేదని… కనీసం 6 వారాల గడువు పాటించలేదని స్పష్టం చేసింది. సో… చిన్న చిన్న లోసుగులనే ప్రభుత్వం కీ పాయింట్స్‌గా చేసుకున్నందున ఇక సమ్మె విరమణ తప్పదని, హైకోర్టు కూడా సమ్మె అంశం లేబర్ కోర్టు చూసుకుంటుందని, ఎవరైనా కార్మికులు స్వచ్ఛందంగా డ్యూటీలో జాయిన్ అయితే సుప్రీం కోర్టు తీర్పు వర్తిస్తుందని తెలిపింది. గతంలో ఎక్స్‌ప్రెస్ న్యూస్ సర్వీసెస్ అంశాన్ని కార్మికుల తరుపు న్యాయవాది ప్రస్తావించారు.
దీంతో సమ్మె విరమించి… స్వచ్ఛందంగా డ్యూటీ జాయిన్ అయితే ప్రభుత్వం వైఖరి బయటపడుతుందని, అప్పుడు ప్రభుత్వం అదే మొండి వైఖరితో వెళ్తే… కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉండొచ్చని ఆలోచిసిన్నట్లు తెలుస్తోంది.
మంగళవారం సాయంత్రం టీఎంయూ, ఈయూతో పాటు ఇతర సంఘాలన్నీ భేటీ అయి… హైకోర్టు విచారణ, సమ్మెపై తుది నిర్ణయం ప్రకటించబోతున్నాయి.