ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని సర్కార్.. దళిత బంధు సక్రమంగా అమలు చేస్తుందా..? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నేతల ఆరోపణలు తిప్పికొట్టేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి. కానీ.. ఆ విమర్శలనే నిజం చేసేలా కనిపిస్తోంది. 20వ తారీఖు వచ్చినా ఇంకా ఆర్టీసీ కార్మికులకు జీతాలు అందలేదు. నెలవారీ జీతంతో జీవితం గడిపే కార్మికులు.. ప్రస్తుత పరిస్థితుల్లో బతుకు బండి ఎలా నడుపుతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేసింది తొలివెలుగు.
ఆర్టీసీ కార్మికుల్లో ఎవరిని పలకరించినా కష్టాలే. జీతాలు సరిగ్గా రాక అప్పులపాలు అవుతున్న పరిస్థితని వాపోయారు. సమైక్యాంధ్రలో ఉన్నప్పుడే జీతాలు సరిగ్గా వచ్చాయని కొందరు కార్మికులు తెలుపగా.. ఇస్తామన్న పీఆర్సీ కూడా ఇవ్వలేదని మరికొందరు మండిపడ్డారు. తమ గురించి కొట్లాడేవారే లేరని చెబుతున్నారు. ఈ క్రమంలో అశ్వత్థామరెడ్డి 3 గంటలకు బస్ భవన్ దగ్గర మీడియాతో మాట్లాడతానని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు పెద్దఎత్తున అక్కడకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. 20వ తారీఖు వచ్చినా జీతాలు ఇవ్వలేదు.. దీనిపై నిరసనలకు దిగాలని నిర్ణయించినట్లు సమాచారం.