సీఎం డెడ్‌లైన్‌ను మరోసారి ఆర్టీసీ కార్మికులు పట్టించుకుంటున్నట్లు కనపడటం లేదు. మంగళవారం వరకు మరో అవకాశం ఇస్తున్నాం… చేరితే చేరండి, లేదంటే సెల్ఫ్ డిస్మిస్ అయినట్లే అంటూ ప్రకటన చేశారు. అయితే దీనిపై కార్మికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమ్మె 31వ రోజుకు చేరింది. మా ప్రధాన డిమాండ్లపై ఇంతవరకు చర్చే జరగలేదు. పైగా బేషరతుగా ఉద్యోగాల్లో చేరండి… 50శాతం ప్రైవేటీకరణ చేస్తాం అంటూ సీఎం మాట్లాడటం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు కార్మికులు. రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ… తాత్కాలిక సిబ్బంది మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేశారు.
ఇబ్రహీంపట్నం డిపో వద్ద కార్మికులు పెద్ద సంఖ్యలో డిపో ముందు బైఠాయించారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ… ఒక్కరు కూడా డ్యూటీలో చేరకుండా సమ్మెను ఉదృతం చేస్తూ, ఆర్డీవో-తాత్కాలిక సిబ్బందిని డిపో నుండి వెళ్లిపోవాలని నిరసన తెలియజేశారు.