ఇంట్లో రిలాక్స్ అవుతున్న ఆర్టీసి సంఘాల నాయకులు
ఖద్దరు చొక్కాలు వేసుకొని ప్రెస్ మీట్ లు పెట్టే కార్మిక నాయకులు ఎక్కడ?
ఆర్టీసి కార్మికుల అరెస్ట్ లు…నాయకులు ఇంట్లో రిలాక్స్
ఆర్టీసి కార్మికులు ఆకలి పోరాటం చేస్తున్నారు. ఆర్టీసి జెఎసి నాయకులు సమ్మె అనగానే, సమ్మె లోకి దిగారు. సమ్మె ఇక చాలు డిపో లోకి వెళ్లి విధులకు హజరు కావాలి అంటే వెళ్లి అరెస్ట్ అయ్యారు. 52 రోజులుగా ఆర్టీసి కార్మికులు రోడ్ల మీదనే ఆకలి పోరాటం చేస్తున్నారు. డిపోల ముందు ఇవాళ ఉదయం నుండి ఆర్టీసి డిపోల ముందు ప్రభుత్వ దౌర్జన్యం కొనసాగుతోంది. తిరిగి విధుల్లో చేరడానికి వచ్చిన కార్మికులను అరెస్ట్ చేస్తున్నారు. కానీ యూనియన్ అధ్యక్షులు మాత్రం ఎక్కడ కనిపించట్లేదు.
టీ ఎంయు అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజి రెడ్డి మిగతా నాయకులంతా గప్ చుప్ గా ఇంట్లో కూర్చున్నారు. బయటకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారన్నది వారి వాదన. ఎప్పుడు బయటకొచ్చిన జరిగేది అదే కదా. ఫోన్ లు కూడా ఆఫ్ లోనే ఉన్నాయి. మరి ఎలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు.ఇప్పటికైనా నాయకులంతా బయటకొచ్చి వీధి పోరాటం చేయాలని ఆర్టీసి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.