ఏ వృత్తిలో ఉన్నా ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉంటేచాలు. అలాంటి సదుద్ధేశ్యంతో.. ఎప్పటికప్పడు సంచలన నిర్ణయాలతో ప్రజల మన్ననలను పొందుతారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. తాజాగా ఆర్టీసీ ప్రయాణిలకు మరో శుభవార్తను అందించారు. హైదరాబాద్ నగరంలోని సీబీఎస్ నుంచి మహత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు ప్రయాణించడానికి ఉచితంగా ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఎలక్ట్రానిక్ వాహనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రయాణికులు ఈ వాహనాలలో ఎలాంటి ఛార్జీ చెల్లించకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన సూచించారు. సురక్షిత ప్రాయాణాన్ని అందించాలని ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నమని స్పష్టం చేశారు.
సీబీఎస్ నుంచి ఎంజీబీఎస్ లోపలకు వెళ్లేందుకు నిత్యం ప్రయాణికులు నరకయాతన పడుతుంటారన్నారు. ఎక్కువ రద్దీ ఉండటంతో పాటు రోడ్డు దాటడం వంటివి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంటాయని.. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రానిక్ వాహనాల ఫ్రీ సర్వీస్ ను ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తెచ్చారు.
ఈ ఎలక్ట్రానిక్ వాహనంలో మొత్తం 12 మంది ప్రయాణం చేయవచ్చు. అయితే.. ఈ ఉచిత సర్వీసులలో మొదటి ప్రాధాన్యత వృద్ధులు, వికలాంగలు, గర్భిణులు, ఇతర ఆరోగ్య సమస్యలున్న రోగులకు ఉంటుందని సజ్జనార్ స్పష్టం చేశారు.