ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సంక్షేమ మండలి సమావేశంలో సజ్జనార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసుల కంటే ఆర్టీసీ ఉద్యోగులే ఎక్కువగా కష్టపడతారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రైవేట్ రవాణా వ్యవస్థ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
వాటికి ధీటుగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఉద్యోగులను కోరారు. ఉద్యోగుల సంక్షేమమే ఆర్టీసీ సంస్థ ప్రధాన ధ్యేయమని చెప్పారు.ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తామని పేర్కొన్నారు.
విధి నిర్వహణలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఆర్టీసీ ఉద్యోగులకు ‘ఎక్స్ ట్రా మైల్’ అవార్డులను అందజేసి ఘనంగా సన్మానించారు సజ్జనార్. తెలంగాణలో తొలిసారిగా టీఎస్ఆర్టీసీ స్లీపర్ బస్ లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు.
వీటిని హైదరాబాద్ నుంచి కాకినాడ, విజయవాడ మార్గాల్లో నడపనున్నట్లు తెలిపారు. కేపీహెచ్‌బీ బస్టాప్ వద్ద బుధవారం సాయంత్రం ఈ కొత్త బస్సులను సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ గారితో కలిసి ప్రారంభించినట్లు వెల్లడించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.