గుంటూరు: ‘విలీనం సిబ్బందికే కానీ, సంస్థకు కాదు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం సాధ్యం కాదు..’ ఇదీ అధికారుల వెర్షన్. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వపరం చేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రికి అధికారులు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. ఆర్టీసీ ఉద్యోగుల్ని మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సాధ్యం కానీ, సంస్థని ఉన్న ఫళంగా ప్రభుత్వంలో కలపడం అంత సులభంగా అయ్యేపని కాదని స్పష్టంగా చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ, సంస్థను సర్కారీలో విలీనం చేయడానికి వీలు లేదని ముఖ్యమంత్రి జగన్‌కు అధికారులు వివరించారని తెలుస్తోంది. కమిటీ నివేదికను అందించడానికి వెళ్లిన సందర్భంలో ఈ డిస్కషన్ జరిగింది.
ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా 39 శాతం ఉంది. దానికితోడు విభజన వల్ల తెలంగాణ, ఏపీల వాటా ఎంతో ఇంకా తేలలేదు. రెండు రాష్ట్రాలూ కలసి కేంద్రం వాటాను తేల్చాల్సి ఉంటుంది. ఆప్పుడే ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యమవుతుంది. ఇదీ తాజాగా తెలిసిన సమాచారం. ఇప్పటికైతే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత విభజన అంశాలు పూర్తిగా ఒక కొలిక్కి వచ్చాక మిగిలిన అంశాన్ని చూద్దామని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.