తెలంగాణ ఆర్టీసీ వరుస ఛార్జీల పెంపుతో ప్రయాణికులకు మోత మోగిస్తోంది. ఇప్పటికే రౌండప్, టోల్ సెస్, టిక్కెట్ ఛార్జీల సవరణ, ప్యాసింజర్ సెస్, డీజిల్ సెస్‌ల పేరుతో.. సిటీ బస్సుల నుంచి గరుడ ప్లస్ బస్సుల వరకు ఛార్జీలు పెంచుతూ ప్రయణికులకు షాక్ ఇచ్చింది ఆర్టీసీ. అయితే, తాజాగా ప్రయాణికులపై మరో భారం వేసింది. రిజర్వేషన్ ఛార్జీలను టీఎస్ఆర్టీసీ భారీగా పెంచింది.
అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఒక్కో టికెట్‌పై రూ.20 ఉండగా మరో రూ.10 పెంచింది. ఇక ఇప్పటి నుంచి ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే రూ.30 చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, పెంచిన రిజర్వేషన్ ఛార్జీలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం. దీంతో గుట్టుచప్పుడు కాకుండా రిజర్వేషనల్ చార్జీలను పెంచారని ప్రయాణికులు మండిపడుతున్నారు. ధరలు ఇలా పెంచేస్తే సామాన్యులు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే మార్కెట్‌లో అన్ని ధరలు పెరిగాయి. వంట నూనె, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. డీజిల్, ఎల్పీజీ ధరలు పెరగడంతో ఆహార పదార్థాల ధరలను కూడా హోటళ్లు పెంచేశాయి. ఇప్పడు ఆర్టీసీలో కూడా వరుసగా ఛార్జీల మోత మోగించడంతో సామాన్య ప్రజలకు భారంగా మారింది.