ఓవైపు ఆర్టీసీ సమ్మెతో ఇంటా బయట విమర్శల పాలవుతోన్న ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. సమ్మెకు తాత్కాలిక సిబ్బంది కూడా మద్దతు ప్రకటిస్తుండటంతో… ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరుగుతోంది.
తమ డిమాండ్ల సాధనకు ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటంతో… ప్రభుత్వం పట్టింపులకు పోయి తాత్కాలిక సిబ్బందితో మేము బస్సులను నడుపుతున్నాం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే, తాత్కాలిక సిబ్బందితో ఇబ్బందులు, ప్రమాదాల సంగతి అటుంచితే… తమకు చెప్పినంత కూలీ ఇవ్వటం లేదని తాత్కాలిక సిబ్బంది సైతం ఉన్నతాధికారులు, ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు.
తమకు సరైన కూలీ ఇవ్వటం లేదని, ఏవేవో సాకులు చెప్పి… డిపో మేనేజర్లు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా మహేశ్వరం డిపోలో ఉదయం నుండి తాత్కాలిక సిబ్బంది సైతం సమ్మెకు మద్దతు పలికి, బస్సులు బయటకు రాకుండా తామే అడ్డుకుంటున్నారు. డీఎంలు వేధిస్తున్నారని, రోజుకు 1750రూపాయలు ఇస్తామని చెప్పి… ఆదాయం రావటం లేదని 900 రూపాయలే ఇస్తున్నారని మండిపడుతున్నారు. ఆదాయం రాకపోతే తమను ఎలా బాధ్యులన్ని చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఆర్టీసీ కార్మికులు సైతం… గతంలో ఇవే ఆరోపణలు చేశారు. డిపో మేనేజర్లు, ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని… ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. తాజాగా తాత్కాలిక ఉద్యోగులు కూడా అవే ఆరోపణలు చేయటం చర్చనీయాంశం అవుతోంది.