సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా నియమించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. 1987 బ్యాచ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి అయిన కాంబోజ్.. ప్రస్తుతం భూటాన్ లో భారత రాయబారిగా పని చేస్తున్నారు.
ఐరాసలో ప్రస్తుతం భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న టీఎస్ తిరుమూర్తి స్థానాన్ని కాంబోజ్ భర్తీ చేయనున్నారు. 1987 ఫారెన్ సర్వీస్ టాపర్ అయిన కాంబోజ్ తన దౌత్య ప్రయాణాన్ని ఫ్రాన్స్‌లోని పారిస్ నుంచి ప్రారంభించారు. 1989-91 మధ్య ఆమె భారత ఎంబసీ మూడో కార్యదర్శిగా పనిచేశారు.
పారిస్ నుంచి వచ్చాక 1991-96 మధ్య విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలోని యూరప్ వెస్ట్ విభాగంలో అండర్ సెక్రటరీగా సేవలందించారు కాంబోజ్. 1996 నుంచి 1999 వరకు మారిషస్ లోని పోర్ట్ లూయిస్ లో భారత హైకమిషన్ లో ఆర్థిక, వాణిజ్య రంగంలో మొదటి కార్యదర్శి గా, చాన్సరీ హెడ్ గా పనిచేశారు కంబోజ్.
Advertisements
ఆ తర్వాత జులై 2017 నుంచి మార్చి 2019 వరకు లెసోతో దేశానికి.. ఏకకాలిక గుర్తింపుతో దక్షిణాఫ్రికాకు భారత హైకమిషనర్ గా పనిచేశారు. 17 మే 2019న భూటాన్‌లో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితికి 2002-2005 వరకు భారత శాశ్వత మిషన్ లో కౌన్సెలర్ గానూ కాంబోజ్ సేవలందించారు. తాజాగా.. ఆమెను ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు వెల్లడించారు.